Skip to content
    HomeJnaana Saraswathiమరచిపోకుము దత్తుని మంచిమాట (Part-14)

    మరచిపోకుము దత్తుని మంచిమాట (Part-14)

    Shri Datta SwamiAugust 1, 20262 min readTel
    Sign in to save your place and continue reading later.

    నాల్గు వర్ణాశ్రమాలకు నడిమిబొడ్డు
    బ్రహ్మమునుజేర నాలుగుపథము లొప్పు
    ఈర్ష్యతో నడ్డదారుల నేగతరమె?
    మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥73॥

    తా॥ నాలుగు కులాలకు, నాలుగు ఆశ్రమాలకు, వారి వారి అనుకూలతను బట్టి బ్రహ్మము అను కూడలికి చేరుటకు నాలుగు మార్గము లున్నవి. ఈర్ష్యతో ఒకదారి వారు అడ్డంగా నడచి వేరు దారికి రాపని లేదు. ఈర్ష్యతో ఎవడూ బ్రహ్మమును పొందలేడు కాన వానికి సిద్ధి రాదు.

    అగ్రవర్ణ పురుషగర్వ మసలు తప్పు
    ఈర్ష్యయు నఘమె పరులకు ఏదియైన
    నరకమె పరశువు నసియు నరుక సమమె
    మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥74॥

    తా॥ అగ్రవర్ణాలకు అంత్యవర్ణాల పైనను, పురుషులకు స్త్రీల పైనను అహంకారము చూపుట అసలు తప్పు. ఇక అంత్యవర్ణాలకు అగ్రవర్ణాల పైన, స్త్రీలకు పురుషుల పైన ఈర్ష్యయుండుటయును పాపమే. అహంకారమూ, ఈర్ష్య రెండూ నరకానికి దారులే. నరకటానికి గొడ్డలి అయిననేమి? ఖడ్గమైననేమి?

    వంచకుడు నష్టమును పొందు, వంచితుండు
    సిరిని పొందగ వంచన చెదరిపోయె,
    చూచువానిని చూచుచు చూడుమిచట
    మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥75॥

    తా॥ మోసగించబడిన వాడు ఐశ్వర్యమును పొందును. మోసగించిన వాడు మొత్తమును కోల్పోవును. కాన మోసమెపుడును నిలువజాలదు. ఇక్కడ నీవు దేనిని చూచినా, నీ చూపును చూచుచున్న దైవాన్ని చూడుము.

    వంచన జయంబు క్షణికంబు వాడె పడును
    ఎత్తు నుండి ఎత్తులకు పై ఎత్తు వేయ
    కలడు పరమాత్మ మూఢులు కాంచలేరు
    మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥76॥

    తా॥ మోసముతో జయించుట క్షణికము. మోసముతో వృద్ధి చెందినవాడు చాలా ఎత్తు నుండి పడును. జీవుని ఎత్తులకు పై ఎత్తువేయు పరమాత్మను మూర్ఖులు చూడలేనందున, ఎత్తులు వేయుచు పరులను మోసగించుచున్నారు.

    మోసగించినవానిని ముంచివేతు,
    మోసగించబడినవాని మోయుచుండు,
    ధర్మరక్షకుడను నేనె ధరణిలోన,
    మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥77॥

    తా॥ మోసగించిన వానిని ముంచి వేస్తాను. మోసగించబడిన వానిని ఉద్ధరిస్తాను. ఈ భూమిలో నేనే ధర్మ రక్షణ చేయువాడను.

    వంచకుడు రావణుండు నిర్వంశుడయ్యె
    ధార్తరాష్ట్రుడు నట్లయ్యె ధూర్త ఖలుడు
    ప్రతి నిమిష మిలనే నుందు పారఁ జూతు
    మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥78॥

    తా॥ మోసగాడైన రావణుడు, దుర్మార్గుడగు దుర్యోధనుడును వంశముతో సహా నాశము చెందిరి. నేను ప్రతి నిమిషము ఈ భూమిపై నుండి అంతా కనిపెట్టియే ఉంటాను.

    To be continued...