మరచిపోకుము దత్తుని మంచిమాట (Part-17)
బ్రహ్మశాసన ధర్మంబు భంగపరచి
బ్రహ్మసంప్రీతి రాదు ఏ పద్ధతులను
ధర్మమును తప్ప బ్రహ్మంబు దరికి రాదు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥91॥
తా॥ ధర్మశాస్త్రము బ్రహ్మము యొక్క శాసనమైన వేదము. మన్వాది ధర్మశాస్త్రములన్నియును వేదోదితములు. అట్టి ధర్మమును తప్పి, బ్రహ్మమును జప, దాన, యజ్ఞాది మార్గములలో దేని చేతనూ ప్రీతినొందించలేము. ధర్మము తప్పినవాని సమీపమునకు కూడా బ్రహ్మము రాదు. ఇక బ్రహ్మ సామ్రాజ్యమును గురించి చెప్ప బనిలేదు.
పాపి సుతులను పొందిరి ప్రాకృతముల
కర్మ చేసినవానికే కలుగు ఫలము,
అతడి పాలనలోన అన్యాయమగునె?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥92॥
తా॥ పాపి యొక్క బిడ్డలు నిష్కారణముగా తల్లితండ్రుల మూలముగా పాపఫలాలను అనుభవించుట అన్యాయము కదా! అని అనుకుంటారు. కానీ ఆ దేవుడి పాలనలో అన్యాయము జరుగునా? ఆ పాపి యొక్క బిడ్డలు కూడా వారి వారి పూర్వజన్మల పాపఫలాలను అనుభవించిరని తెలియవలయును.
ధర్మమునుతప్పి జ్ఞానియై తపముసేయ
శిక్ష తప్పునే ఎంతటి సిద్ధునకును?
రావణుని భక్తి జ్ఞానంబు రక్షయగునె?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥93॥
తా॥ ఎంత పండితుడైనా తపస్వి అయినా సిద్ధుడైనా ధర్మమును తప్పినచో శిక్ష తప్పదు. రావణుని భక్తిజ్ఞానాదులు వాని శిక్షనుండి వానిని తప్పించి రక్షణము చేయజాలినవా? లేదు, లేదు.
పశువు మన్నించబడు, దైత్యుఁబట్టి చీల్చు,
తెలిసినట్టి మూర్ఖుడు కాన తీవ్రశిక్ష ,
దిద్దుకొన గోటితో బోవువద్దు తపము,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥94॥
తా॥ తెలియని పశువును భగవంతుడు క్షమించును కాని తెలిసి పాపము చేయు దురహంకార మూర్ఖుడగు రాక్షసుని పట్టి చీల్చి తీవ్రశిక్షను వేయును! దిద్దుకొని పాపమును గోటితో పోగొట్టుకొనక పాపములను పోగొట్టనేని తపస్సు చేయనేల?
ధర్మ మెపుడు వృద్ధియగు అధర్మమెపుడు
నాశ మొందును యుగయుగ న్యాయమిదియె
భగవదాజ్ఞయే ఇది బాధపడగనేల?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥95॥
తా॥ ధర్మమెల్లప్పుడును వృద్ధిచెందును. అధర్మము నాశనమగును. ప్రతి యుగములోను ఈ న్యాయము జరుగుతుంది. ఇది భగవంతుని ఆజ్ఞ కాన అనవసరంగా బాధపడ నవసరము లేదు.
యముని శిక్ష మార్కండేయునందు వేరు,
ఇష్టమైన సావిత్రికి నిచ్చెనతడు,
ధర్మ పక్షపాతముఁ జూప తప్పుగాదె?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥96॥
తా॥ మరి, ధర్మనిర్వహణము చేసిన యముని శిక్షించితి నేలయన్న అచట సూక్ష్మమున్నది. సావిత్రి విషయములో యముడు స్వతంత్రించి, భర్త ప్రాణముల నిచ్చెను. అచట ధర్మమును తప్పి, నా భక్తుడగు మార్కండేయుని విషయములో కర్తవ్యములో పట్టుపట్టుట తప్పు గదా? అంటే తన కిష్టమైనచో ధర్మము తప్పవచ్చునా? (సావిత్రి విషయములో) ఇష్టము కానిచో కర్తవ్య ధర్మమును ఆచరించ వలయునను సాకు చూపవచ్చునా? (మార్కండేయుని విషయములో).
To be continued...