Skip to content
    HomeJnaana Saraswathiమరచిపోకుము దత్తుని మంచిమాట (Part-19)

    మరచిపోకుము దత్తుని మంచిమాట (Part-19)

    Shri Datta SwamiAugust 1, 20262 min readTel
    Sign in to save your place and continue reading later.

    ధర్మకర్తయే జీవుండు ధనములకును
    వానిదే ధనమంతయు ననుసరించు
    పాప పుణ్యంబులే ఏది పట్టుకొనడు
    మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥103॥

    తా॥ జీవుడు కేవలము ఒక ధర్మకర్త వంటివాడే. ఈ ధనమంతయును భగవంతుని ఆస్తియే. జీవుడు పోయేటప్పుడు ఈ ధనములో దేనినీ కొనిపోడు. ఈ ధన విషయమున తాను వ్యవహరించినట్టి పాపపుణ్యములను మాత్రమే తన వెంట కొనిపోవును.

    వ్యాఘ్రవేషాన భయపడు వ్యాఘ్రబలికి,
    భయపడడు, శిశువు గుణంబరయబోడు,
    విదులు గుణతత్త్వ విజ్ఞులు వేరు భువిని,
    మరచిపోకు దత్తుని మంచిమాట. ॥104॥

    తా॥ అజ్ఞానులగు బాలురు పులివేషగానిని చూచి భయపడుదురు. నిజముగా పులి బలము కలవానిని చూచి భయపడరు. వీరు నామరూప భ్రాంతులే తప్ప తత్త్వమును, గుణమును తెలియజాలరు. జ్ఞానులగు వారు పులివేషగానిని చూచి భయపడరు. పులి బలము కలవానిని చూచి భయపడుదురు. జ్ఞానులు గుణతత్త్వవేత్తలు. నామరూప భ్రాంతి కలవారు కారు. అజ్ఞాని - జ్ఞాని భేదమిదే.

    ఫలము కోరక అభిమాని ప్రాణమిచ్చు
    చలనచిత్ర నాయకునికి సత్యభక్తి
    వాడె గురువు దుర్లక్ష్యంబు వదలు మచట
    మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥105॥

    తా॥ ఒక సినిమా హీరో మరణించగా, వాడి అభిమాని, ఎట్టి ప్రతిఫలాపేక్ష లేకుండగ, వాడు ప్రాణత్యాగము చేయుచున్నాడు. అట్టి వెర్రి అభిమానిని గురువుగా తీసుకొని నీవును భగవంతుని వెర్రి అభిమానివి కమ్ము. వాని వెర్రి ప్రేమ సత్యభక్తియే కాని వాడి లక్ష్యము సినిమా హీరో అయినందున వాడు చెడినాడు. వాని లక్ష్యమును వదలి భగవంతుని లక్ష్యముగ నుంచుకొన్న తరించును. కాన వాని చెడు లక్ష్యమును వదలి, వాని వెర్రి ప్రేమను మాత్రము గ్రహించుము.

    కొండనెక్కుట కష్టంబు, కొండనుండి
    జారిపడుటయో తేలిక, సాధనమున
    సిద్ధి యోగంబు భ్రష్టుడు చెడుట ఇట్లు
    మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥106॥

    తా॥ కొండనెక్కుటకు చాలా సమయము పడుతుంది. చాల కష్టము కూడా. కానీ కొండనుండి జారిపడుట క్షణము చాలును. చాలా తేలిక. ఇలానే సాధనలో దైవమును చేరుట చాల కష్టము, చాల కాలము పట్టును. ఆ దైవానుగ్రహము తప్పి యోగ భ్రష్టుడగుట చాల స్వల్పకాలములో చాల సులభముగా జరుగుతుంది.

    అట్ట అడుగున ఉండుము అందరికిని,
    పతనముండదు, పూజించు పతిత నరుల,
    స్వామి రూపంబు కావచ్చు నేమియైన,
    మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥107॥

    తా॥ అందరికీ అట్ట అడుగున అధమాధమునిగా జీవించుము. అక్కడ నుండి నీ కెన్నటికీ పతనము లేని చోటు అది. అధములను సైతము పూజించుము. ఏమో! స్వామియే ఆ అధముడి రూపములో వచ్చాడేమో. వానిని నిందించిన స్వామి నింద అగునుగదా!

    పంచదార గాడిద తీపి బాగుగాను
    మట్టి చిలుక రుచింపదు మానవునకు
    స్వార్థరహిత సహిత కర్మసరణి నాకు
    మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥108॥

    తా॥ గాడిద బొమ్మ అయినా పంచదారతో  చేసినది మధురముగ నుండును. చిలకబొమ్మ అయినా మట్టితో చేసినది మనుజునకు రుచించదు. అట్లే స్వార్థ రహితమైన పిచ్చిగంతుల భజన అయినా భగవంతునికి ముధురముగా ఉండును. స్వార్థముతో కూడిన పవిత్ర యజ్ఞమైనను భగవంతునికి రుచించదు. ఆరాధనా విధానమేది? అని కాదు. ఆ విధానము స్వార్థరహిత నిర్మల ప్రేమతో కూడినదా? లేదా? అనునదే భగవంతునకు ప్రధానము.

    To be continued...