Skip to content
    HomeJnaana Saraswathiహిందూమత వివరణము (Part-9)

    హిందూమత వివరణము (Part-9)

    Shri Datta SwamiAugust 1, 20262 min readTel
    Sign in to save your place and continue reading later.

    9. ఉపనయనము:

    ఉపనయనము అనగా జ్ఞాన, స్తుతి, సేవలద్వారా భగవంతునికి దగ్గరగా అగుట. బుద్ధితో విశ్లేషణమను జ్ఞానయోగముద్వారా గుర్తించవలసిన భగవంతుని స్వరూపమును నిర్ణయించి, భక్తియోగముద్వారా మానసిక ఆవేశమును కలుగజేయు భక్తిగీతములతో ఆయనను స్తుతించి, పాకముచేసి అర్పించుట మొదలగు కర్మయోగ సేవలద్వారా నరాకారము లోనున్న దైవ రూపమగు సద్గురువును సమీపించుటయే ఉపనయనము.

    రూఢిద్వారా ఉపనయనము అనగా అర్థమును తాము తెలియక ఇతరులకు అర్థమును తెలియబరచక ఉండు బట్టీబ్రాహ్మణులు చేయు ఒకానొక సంస్కార కర్మయే. అట్లే రూఢిలో గాయత్రి అనగా అర్థమును తెలియక జ్ఞానమును బోధించు గాయత్రిఛందస్సులో జపించబడుచున్న ఒకానొక మన్త్రమే (గాయత్రీఛన్దః సవితా దేవతా). మరియు ఇచ్చట దేవత, స్త్రీరూపముగా కల్పించబడిన గాయత్రికాదు, సవితగా చెప్పబడిన పరమాత్మయే. యోగరూఢిలో గాయత్రి అనగా గానముతో దేవుని స్తుతించుటయే.

    Swami

    భగవంతుడు అందరికీ తండ్రియే కావున ఆయనను సమీపించుటకు కుల, లింగములకు అతీతముగా సంతానమైన వారందరికినీ సమానమైన అధికారము కలదు (స్త్రియో వైశ్యాః - గీత), బ్రహ్మసూత్ర భాష్యారంభములో శంకరులు కూడా బ్రహ్మప్రాప్తికి కుల, లింగములకు అతీతముగా అందరికినీ సమానమైన అధికారము కలదని పలికినారు. ఈ ఉపనయనము యోగరూఢి బ్రాహ్మణులకే (జ్ఞాన ప్రచారమును చేయువారు) విధించబడినది. ఏలననగా ఈ ఉపనయనములో గాయత్రీమన్త్రము దైవప్రార్థన (ఉపాసనప్రకరణము) కానేకాదు. ఇది కేవలము దైవస్వరూపమును గుర్తించు జ్ఞానము (జ్ఞాన ప్రకరణము) ను బోధించుటయే. కావున ఈ జ్ఞానప్రచార వృత్తిని బోధించు ఉపనయనము అందరికీ అక్కరలేదు. ఈ జ్ఞానప్రచారము ఫలముకాదు.

    జ్ఞానబోధకమగు ఈ మన్త్రమును ప్రత్యేకమైన దైవప్రార్థనయని మరియు దానియందు తమకే అధికారమున్నదని విపరీతార్థమును ప్రచారము చేసిన అజ్ఞానులగు బట్టీబ్రాహ్మణులను నమ్మి, సంస్కృతము తెలియకపోవుట అను అదే అజ్ఞానములో తామునూ మునిగినందున సంప్రదాయ దూషణములకు దిగిన జనులుకూడా శోచనీయులే. దీనివలన సర్వజనులును అదేదో ప్రత్యేక ప్రార్థనయని ఉరుకుల పరుగులతో దాని వెంటబడినారు. ఈ మన్త్రము దేవుని స్వరూపమును చెప్పు జ్ఞానమేకానీ ఏ ప్రార్థనయు కాదు. గాయత్రి అనగా దేవుని గానముతో స్తుతించమను విషయమేతప్ప స్త్రీ రూపమగు దేవత కాదు. ఈ రెండింటిని జ్ఞానముతో అర్థముచేసుకొన్నచో మాతృభాషలో దేవుని గానముతో స్తుతించుట మరియు దైవరూపుడగు సద్గురువును అగ్నికార్య పాకము మొదలగు సేవలద్వారా సేవించుట అను ఫలములు అందరికీ చిక్కును. అజ్ఞానముతో సిద్ధించిన ఈ దుష్టసంప్రదాయమును త్యజించి ఋషులు స్థాపించిన సత్సంప్రదాయమును అనుసరించి ఫలములను పొందవలయును.

    To be continued...